ప్రయాణం,
ఆగని ప్రయాణం, అలుపెరగని ప్రయాణం
గమ్యం చేరేదాకా, గూటికి చేరేదాకా
చితికిన బతుకులు
చిందరవందర బతకులు
చిగురుటాకులా వణికిన బతుకులు
మండుటెండలో ఎండుటాకులా ఎగిరిన బతుకులు
హోరుగాలిలో కాగితపు ముక్కలా కొట్టుకుపోతున్న బతుకులు
ఆగని ప్రయాణం, అలుపెరగని ప్రయాణం
గమ్యం చేరేదాకా, గూటికి చేరేదాకా
చిరిగిన బట్టలు, విరిగిన చెప్పులు
వందల మైళ్ళు, పగిలిన పాదాలు
ఎండిన గొంతుకులు, మాడిన మాడులు
ఆకలిమంటలు, మండిన ప్రేగులు
ఆగని ప్రయాణం, ఆలుపెరగని ప్రయాణం
గమ్యం చేరేదాకా, గూటికి చేరేదాకా
నడినెత్తిన సూర్యుని ప్రతాపం
తరగని దూరంపై మనసులో కోపం
పసిపిల్లలు ఏం చేశారు పాపం
పాల సీసాల్లో మంచినీళ్ళు లో మోసం
భూజలపై సంసార బహుమతులు (పిల్లలు)
వెన్నుపై భారమైన బరువులు
నడిరోడ్ల పై పడకలు
పుట్‌పాత్ ల పై నడకలు
స్వేధంలో తడిసిన ముద్దయిన తనువులు
ఖాకీలుతో తన్నులాటలు
దారి దొంగలతో కుమ్మలాటలు
సేద తీరితే చీత్కారాలు
దారి పొడుగున నిలువు దోపిడీలు
నీరసంతో నేలకూలిపోయినా
నిస్సత్తువతో నడువలేకున్నా
నిస్సహయంతో నీరుగారినా
నిస్తెజంతో అలసిపోయినా
ఆగని ప్రయాణం, అలుపెరగని ప్రయాణం
గమ్యం చేరేదాకా, గూటికి చేరేదాకా