Happy Ugadi 2023
![]() |
www.telugukavitaluu.com |
తెలుగు ప్రజలు అందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ పర్వదినం మరొక గొప్ప ఆరంభం కావాలని నా ఆకాంక్ష.
ఉగాది పుట్టుక:
హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. ఇది తెలుగు వారికి సంవత్సరంలో వచ్చే తొలి పండగ. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆకాంక్షలను మోసుకొచ్చే పండగ. అందుకే ఈ ఉగాది పర్వదినాన జీవిత సారాన్ని తెలిపే ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు. రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ అన్ని రుచులను అనుభవిస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఉగాది పండుగ సూచిస్తుంది.
ఉగాది చరిత్ర:
హిందూ పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించి, కాలాన్ని సృష్టించిన రోజు అని నమ్ముతారు. యుగానికి ఆరంభం జరిగింది కావునే ఇది యుగాది అయింది. చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి ఉగాది యుగమునకు ఆది ఉగాదిగా. హిందూ పురాణాలు తెలియచేసాయి.
రాష్ట్రాలు – పేర్లు:
ఉగాదిని పలు రాష్ట్రాల్లో పలు పేర్లతో పిలుస్తారు. తెలుగు ప్రజలకు ఉగాది, కన్నడిగులకు యుగాది, ఉత్తర భారతదేశంలో దుర్గామాత తొమ్మిది రూపాలను జరుపుకునే తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజు – చైత్ర నవరాత్రి, మహారాష్ట్రలో గుడి పడ్వా, అలాగే తమిళులు పుత్తాండు పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
శ్రీకారం చుట్టే కార్యాలు:
తెలుగు సంవత్సరాది మొదటి రోజున కొత్త పనులు ఆరంభించడం, విద్యార్థులు కొత్త పాఠాలను ప్రారంభించడం, కళాకారులు కొత్త కళను ప్రారంభించడం, గృహస్తులు ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుక్కోవడం వంటివి ఉగాది రోజున చేయడం శుభప్రదం. ఈ సంతోషకరమైన సందర్భాన్ని మన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆనందంగా జరుపుకోవడం. ఇక నుంచి అంతా శోభకృత నామ సంవత్సరం, శోభకృత్ అంటే శోభను కలిగించేది అని అర్థము. ఈ సంవత్సరం అందరి జీవితాలలో వెలుగును నింపేది అని అర్థం.
ఉగాది ప్రాముఖ్యత:
![]() |
www.telugukavitaluu.com |
యుగాది అంటే ఒక సంవత్సరం ప్రారంభం. యుగం అంటే కాలం. ఆది అంటే ఏదో ప్రారంభం. ఉగాది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మ దేవుడు చేసిన కృషిని సూచిస్తుంది. శీతాకాలంలోని కఠినమైన చలి తర్వాత, వసంతకాలం ప్రారంభం, తేలికపాటి వాతావరణాన్ని సూచించే పండుగ కూడా దీనిని పరిగణిస్తారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని… మన దగ్గరి, ప్రియమైన వారితో ఆనందంగా కలిసిమెలిసి జరుపుకుంటారు.
ఉగాది ఎలా జరుపుకుంటారంటే:
పండుగకు వారం రోజుల ముందు నుంచే ఉగాది వేడుకలకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు. గృహ ద్వారబంధాలను మామిడి ఆకులతో అలంకరిస్తారు. పండుగ రోజున ప్రజలు తమ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవు పేడతో కలిపిన నీటిని చల్లుతారు. అనంతరం ముగ్గులు వేసి పువ్వులు, రంగులతో అలంకరిస్తారు. స్నానాలు చేసి.. కొత్తబట్టలు ధరించి దేవుళ్లకు పూజలు చేసి.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికుతారు. ఉగాది పచ్చడితో పండుగను ప్రారంభించి.. రకరకాల పిండివంటలు చేసుకుంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
![]() |
www.telugukavitaluu.com |
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవా ప్రతీక.
బెల్లం తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేత
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
పంచాంగ శ్రవణం:
![]() |
www.telugukavitaluu.com |
తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవొచ్చు. మరియు సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా అలోచించి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు.
కవి సమ్మేళనం:
సాయంకాలం కవులు ఒక చోట చేరి కవిసమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యాలు పాడుకోవటం జరుగుతుంది.