ఈశావాస్యోపనిషత్-1
సీసం
పరమాత్మ తత్త్వమ్ము పరిపూర్ణమైనట్టి
దాద్యంతములులేనిదట్టియాత్మ
ఆయాత్మనుండియే నావిర్భవించెనీ
నశ్వరంబగునట్టి విశ్వమంత
నామరూపాదులే నాశమౌ జగతిలో
నాభాస జనితమ్ములాత్మలోన
భ్రమవీడి జ్ఞానియై పరికించ విశ్వమే
పరిపూర్ణమైనట్టి బ్రహ్మమగును

ఆవె
పూర్ణమీజగత్తు, పూర్ణమా బ్రహ్మము
పూర్ణతత్త్వమందు పూర్ణముండు
వేద్యమౌ జగత్తవిద్యతొలగినంత
పూర్ణతత్త్వముగనె పూర్ణమందు

శాంతి మంత్రం:
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః |

భావము
కనిపించని బ్రహ్మము పూర్ణమైనది ఈ దృశ్య ప్రపంచము పూర్ణమైనది అదృశ్యుడయిన పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య ప్రపంచం వెలువడింది. దృశ్య జగత్తును పూర్ణ బ్రహ్మమునుండి వేరు చేసినప్పటికినీ ఆయన పరిపూర్ణుడే.

సత్యమైన పరమాత్మ తత్వం పరిపూర్ణమైనది. ఆ పరమాత్మ నుండియే ఈ జగత్తంతా బయట ఉన్నట్లుగా తోచుచున్నది. అనగా ఆ పరమాత్మ కన్నా జగత్తు వేరుగా ఉన్నట్లు ఉన్నదని అర్ధం. కాగా జగత్తు కూడా పరిపూర్ణమైనదే అని చెప్పవలెను. ఎందుకంటే బ్రహ్మము యొక్క వివర్తమే జగత్తు కదా. పరమాత్మ నుండి ఈ జగత్తు వేరుగా, విడిగా తోచిననూ ఇది సత్యం కాదు. పరమాత్మయే సత్యం, పరిపూర్ణము.

ఈశావాస్యోపనిషత్ -2.
ఉత్పలమాల
శాశ్వత మైన నీశ్వరుడె సర్వ జగత్తుల నిండి యుండగన్
నశ్వర నామరూపముల నన్ని జగత్తున వీడుచున్ సదా
విశ్వము నీ స్వరూపమను విజ్ఞతతో సిరి కోరకెన్నడున్
విశ్వము నాశ హీనమగు విష్ణుమయమ్మని విశ్వసించుమా

ఓం ఈశా వాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ |
తేన త్యక్తేన భుఞజీథా మా గృధః కస్య స్విద్ధనమ్ || || ౧ ||

భావం
ఈ జగత్తంతయు నామరూప క్రియా రహితమగు ఈశ్వర స్వరూప మాత్రముగా తిలకింపుము. ఇందలి నామాకృతి క్రియా దులను మనస్సుచేత త్యజించి, స్వరూపమను భోజనమును భుజింపుము. నీ ధనమును గానీ పర ధనమును గాని ఆశించకు. విశ్వమున గల సకలము ఈశ్వరుడేయను నిశ్చయబుద్ది కలిగియుండుము

ఈశావాస్యోపనిషత్- 3
ఆటవెలది
శాస్త్ర సమ్మతమగు సత్కర్మ మాత్రమే
చేసి కోరు నిండు జీవితమును
కర్మ ఫలితములను కడతేర్చు కొనుటకు
మార్గమిదియె కర్మ మార్గికిలను

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః |
ఏవం త్వయి నాన్యథేతో~స్తి న కర్మ లిప్యతే నరే || || ౨ |

భావం
శాస్త్ర సమ్మతము లయిన కర్మలను చేయుచు మాత్రమే మానవుడు వంద సంవత్సరాలు జీవించవలెనని కోరు కొనవలెను.
జీవితము పైన మమకారము ఉన్నంత వరకు దుష్కర్మ కాలుష్యము లను పోగొట్టుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు.

4.
ఆటవెలది
ఆత్మ నెరుగని జనులజ్ఞాన తమసుచే
కామ్య కర్మలందు గడిపి బతుకు
మరణమొందినపుడు నరక లోకములందు
బాధ లనుభవించి భవమునొందు

అసుర్యా నామ తే లోకా అన్ధేన తమసా~వృతాః |
తాంస్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యే కే చాత్మహనో జనాః || || ౩ ||

భావం
అవిద్యా దోషమున ఆత్మ నెరుగని విద్వాంసులు అజ్ఞానమను తమస్సుచే ఆవరింపబడిన దేవాది లోకములను దేహము విడిచిన తర్వాత పొందుదురు.

ఈశావాస్యోపనిషత్ – 4

సీ.
నిండి యంతట నుండి నిశ్చలంబైనను
మనసు కంటెన్ వేగమైనదాత్మ
పరుగులో నన్నింట పరమాత్మయే మిన్న
ఇంద్రియమ్ములు దాని నెరుగ లేవు
జీవులా యాత్మచే జీవించుచుందురు
చలనరహిత మాత్మ చలనమదియె
చేరువగనదియె దూరముగనదియె
ఆత్మయే జగతిలో నంతటయును

ఆటవెలది
బయట లోపలయును వ్యాపించి యున్నట్టి
యాత్మ నెవరు జీవులందు జూచి
యాత్మలోన జీవులందరిని గనునో
యట్టివారికేది గిట్టమికను

భావము (4,5,6 మంత్రములు)
అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్పూర్వమర్షత్ |
తద్ధావతో~న్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి || || ౪ |

పరమాత్మ నిశ్చలమైనననూ మనసు కంటే వేగమైనది. ఇంద్రియాలకు అతీతమైనది. అనగా పరమాత్మను చేరుకోలేవు. కనుక అది అన్నటి కంటే అతివేగంగా పరుగిడ గలదు. విశ్వంలోని సమస్త జీవులు దానివలననే జీవించగలుగుతున్నారు.

తదేజతి తత్రైజతి తద్దూరే తద్వన్తికే |
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః || || ౫ |

ఆత్మ చలించును. చలింపదు. ఆత్మ అతిదగ్గరగా వుండును అట్లే అతి దూరముగా కూడా ఉండును. ప్రపంచమునకు లోపల అంతా వ్యాపించి ఉండును అట్లే బయట వ్యాపించి ఉన్నదంతయు ఆత్మయే.

యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి |
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే || || ౬ |

ఎవరైతే అన్ని జీవులలో తన ఆత్మను చూస్తాడో అలాగే అన్ని జీవులలో తనను చూడగలుగుతాడో అతడు ఎవరినీ ద్వేషించడు.