మత్త కోకిల – ర స జ జ భ ర
యతి మైత్రి – 11 వ అక్షరం

🙏ఓం శ్రీ సరస్వత్యైనమః🙏
జ్ఞానరూపిణి శ్వేతధారిణి నాభిజాతుని కంగనా
రాణి వందన మమ్మనాపద రాజమాలిక వేయగా
వాణి మోదము కోరి వ్రాసితి వాసిగా చిరు పద్యముల్
నేనుపూనిన పద్యవాహిని నేర్పుతోకొన సాగనీ.
…….కోట శర్మ…..

ఆటవెలదులు

1. దుర్గ యనిన సకల దుర్గతుల్ తొలగును
దుర్గ యనగ సకల దురిత హారి
దుర్గ యనగ సకల దుఃఖనివారిణి
కరుణ చూపు తల్లి కనక దుర్గ

2. కనకదుర్గ మల్లికార్జునులిద్దరు
అమ్మవారి తోడ నయ్య వారు
కొండ మీద మనకు నండగా నుండిరి
కరుణ చూపు తల్లి కనక దుర్గ

3. జయము జయము నీకు జగములకు జనని
జయము నిన్ను గొల్చు జనులకెపుడు
జయము ధర్మమునకు జననినీవుండగన్
కరుణ చూపు మమ్మ కనక దుర్గ

4. శరణు వేడు కొందు శ్రద్ధతో యమ్మను
చరణ పద్మములకు శిరము వాల్చి
హరణమౌను నిక్కమన్ని దురితములు
కరుణ చూపు తల్లి కనక దుర్గ

5. కోట్ల భక్త జనుల కోర్కెలు తీర్చంగ
నింద్ర కీల గిరిని యిల్లు చేసి
విజయ వాడ లోన వెలసెను దుర్గమ్మ
కరుణ చూపు తల్లి కనక దుర్గ

6. ఆది శక్తి దుర్గ యాద్యంత రహితము
నాది శక్తి! కొలిచి నంత నిన్ను
నాది లేని దుఃఖ మంతమౌ మెదలంట
కరుణ చూపు మమ్మ కనక దుర్గ

7. మాధవుండు ధర్మమాచరించగ నాడు
కనిన సంతసించి కనికరమున
కనక దుర్గ కనుక కనకవర్షమునిచ్చె
కరుణ చూపు తల్లి కనక దుర్గ

8. ఫల్గుణుడు తపమును భక్తితో సేయంగ
శంకరుండు మెచ్చి సంతసించి
పాశుపతమునొసగె పాండవునకిచట
కరుణ చూపు మల్లి కార్జునుండు