తత్వ చింతన – అవస్థాత్రయ వివరణ

కం. మెలకువ నిదురయు కలలను
త్రిలోక ములలో మనుజుడు తిరుగును నిలలో
మెళుకువతో లోకమ్ములు
తిలకించగ విదితమగును తీరు తరింపన్

కం. మెలగును తనువును మనసును
మెలకువలో, మనసొకటియె మెదలును కలలో
కలిపించి లేని జగతిని,
కలలుకనని నిదురలోన కనబడ వేవీ!

కం. మెలకువ లో కనబడునవి
కలలో నుండవు, కలిగిన కల కనుమరుగౌ
మెలకువలో, మాయమగు స
కలము నిదురలో, సకలము కనునది నీవే…. కోట శర్మ

వివరణ: జ్ఞాన మార్గమున ఆత్మవిచారణకు తద్వారా అపరోక్షానుభూతికి అవస్థాత్రయ పరిశీలన మావశ్యకము.
జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనగా గాఢనిద్రలు అందరికీ అనుభవములోనున్న విషయాలే.

మెలకువగా ఉన్నప్పుడు మనిషి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములతో పాటు అంతఃకరణముతో వ్యవహరిస్తాడు.
కాని కలలో కేవలము మనసుతో మాత్రమే మెలగును. కలలు లేని గాఢనిద్ర యందు మనసుకాడా వ్యవహరించదు. కలలో వస్తువులు ప్రాతిభాసికాలు అనగా మిథ్య అయి ఉంటాయి. ఆవస్తువులే మెలకువలో స్థిరంగా, వ్యావహారికంగా ఉంటాయి. కాని ఈ రెండు అవస్థల్లోనూ కలిగే జ్ఞానం మాత్రం ఒకటే.

గాఢనిద్రనుండి మేల్కొన్న వ్యక్తికి, నిద్రలో తనకు ఏమీ తెలియలేదు అనే అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం స్మృతిరూపంలో ఉంటోంది. అనుభవం లేకపోతే దాని జ్ఞాపకమే ఉండదు కదా! కాబట్టి గాఢనిద్ర లో “ఏమీ తెలియకపోవటం అనేది ” అనుభవమైనదని తెలుస్తోంది. ఈ అజ్ఞానానుభవస్మృతే మేల్కొన్నప్పుడు కలుగుతోంది. కాబట్టి గాఢనిద్రలో బాహ్యకరణములు, అంతఃకరణము పనిచేయకపోయినప్పటికీ, జ్ఞానముంటుందని తెలుస్తోంది.

మూడుస్థితులలోనూ మారిపోతున్న వస్తువులను తాను మారకుండా, సాక్షీరూపంగా, ఏకరూపంగా గమనిస్తున్న జ్ఞానమే ఆత్మ స్వరూపము. నీ అసలు రూపము.. కోట శర్మ

సీ. కలయందు మెదలును – కల్ల నిజము గాను
కలగనునపుడె యా- కలలు నిజము
మెలకువన జగము – మెదలు స్ధిరముగాను
లోకమెల్ల నిజము – లౌకికముగ
దేహమే నేనన్న- ఊహ వీడి నపుడె
నీవు నిత్య మనెడి – నిజము నిజము
ఉన్నదంతబ్రహ్మ- మొక్కటన్న నిజము
నీవెరిగినపుడె – నీవు నిజము

ఆవె. నీది నాది యన్న భేదంబు లేదని
పారమార్ధికమున పఱగ దగును
నేను నీవు వేరు, మేను నేనేయన్న,
శంకరుండు జెప్ప శంక లేల
వివరణ:
శ్రోత్రాది ఇంద్రియాలు ఉపశమించగా, జాగ్రదావస్థలోని సంస్కారాలవల్ల కలిగిన విషయజ్ఞానాన్నే స్వప్నం అంటారు. జాగ్రదవస్థలో మనం ఒక వస్తువును చూచినపుడు అది మనకు స్థిరంగా, వ్యావహారికంగా స్పష్టమైన జ్ఞానం ఇస్తుంది. స్వప్నంలో ఆ వస్తువును చూచినపుడు, ఆ వస్తువులాగా (ప్రాతిభాసికంగా) కనిపిస్తుంది. ఇదే ప్రాతిభాసిక జ్ఞానం. ఇది స్థిరంగా, స్ఫుటంగా ఉండదు.

స్వప్నంలో మనమెన్నో దృశ్యాలు ప్రత్యక్షంగా చూచినట్టే చూస్తుంటాము. అవన్నీ మనకప్పటి కప్పుడెంతో యదార్ధంగానే భాసిస్తుంటాయి. అసత్యమనే భావన ఏ మాత్రమూ మనసుకురాదు. అలా చూస్తున్నంతసేపూ అది సత్యమే. కాని ఉన్నట్టుండి మెళుకువ వస్తే చాలు. మరుక్షణమే మటుమాయమై అంతా అసత్యమని తేలిపోతుంది. అయితే మెళుకువ వచ్చేంతవరకూ తాత్కాలికంగానైనా అది సత్యమే. దీనినే ప్రాతిభాసిక సత్యమంటారు శంకరభగవత్పాదులు.

అలాగే ఈ లోక వ్యవహారం కూడా మానవుడికాత్మ ప్రబోధం కలిగేంత వరకూ సత్యమే. అజ్ఞాన జనితమైన దేహాత్మభావము ( అనగా దేహమే నేనన్న అపోహ ) ఉన్నంత వరకూ లోకవ్యవహారము సత్యమే. దీనికి వ్యావహారిక సత్యమని పేరు. ఆ తరువాతనే ఇది అసత్యం. అప్పుడు కూడా అందరికీ కాదు. ఎవరికి ప్రబోధం కలిగిందో వారికే. మిగతా వాళ్ళకంతా మరలా సత్యమే. అపరోక్షానుభూతి కలిగిన జ్ఞానులకు తమ సహజస్థితిలో పారమార్ధిక సత్యమును, సచ్చిదానందరూపమైన బ్రహ్మమే సత్యమూ, సర్వవ్యాపకముగా అనుభవం కలుగుతుంది. జీవ బ్రహ్మ జగత్ ల అభేదభావము పారమార్థిక సత్యము.