భజగోవిందము – ద్విపదమాలికలో

1. భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

2. వీడుమత్యాశను -విత్తార్జనమున
వీడుమాశలనెల్ల- విమలచిత్తమున

సరియైన రీతిలో -సంపదల్ పొంది
పరితుష్టి కలిగుండు -బాధలన్ వీడి

స్మరియించు గోవిందు -సద్భక్తి తోడ
హరియించు పాపము-లామూలముగను

3. వ్యామోహ మొందకు -మతివలను గని
యేమార్చు మాంసాదు- లీయందమంత

తనువు హేయమ్ముగా -దలచి నీవెపుడు
మనసులో చింతించు- మరువకెన్నడును

భక్తితో గోవిందు -భజియించు సతము
ముక్తికలుగు నీకు -మోహమ్ము తొలగి

4 తామరాకుననీరు -తలకు చందమ్ము
గా మనిషి బ్రతు-కతి చంచలమ్ము

చింతలపోహలే-జీవితమంత
సంతోషమేలేదు- స్వల్పమైనగన

శరణువేడుముసదా -సర్వాత్మకుడిని
మరుజన్మ తొలగించు- మార్గమున్ దెలుపు

5. ధనమును గడియించు -దనుకనీ పైన
ననురాగ మునుచూపు -నాప్తులైనటుల

నీమేను ముదిమిలో- నీరసించు తరి
నీమేలు నడుగుచు- నినుజేరరెవరు

గోవిందు భజియించు -గోప్యమ్ము తెలియ
కావించ గలదునీ -కాత్మదర్శనము

6. ఊపిరి నీమేన -నున్నంత వరకె
నీపత్ని సుతులునున్- నిను బల్కరింత్రు

గాలియాడని మృత- కాయమున్ జూచి
ఆలుబిడ్డలునైన -హడలిపోవుదురు

భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

భజగోవిందము – ద్విపదమాలికలో – 2 of 2
(పూర్తి అనువాదము కాదు)

7. ధనమెల్లపుడును బా-ధలనిచ్చునరయ
ధన మెట్టి సుఖమీయ-దనియెర్గి యుండు

ధనవంతులైనను -దనయుల వలన
వణకుదురంతటన్ -భయపడి యిలను

భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

8. చిరుతడి కాటల -చింతన లెపుడు
తరుణుడు కోరును -తరుణిని సతము

(బాలుడి కాటల -పాటల చింత
వాలుగంటి తలపె-ప్రాయమునందు)

వృద్ధుడు చింతల -వృష్టిలో మునుగు
శుద్ధాత్మ నెఱుఁగెడి-సుమతులే లేరు

భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

9. సంతానమెవ్వరు -సతి యెవ్వరరయ
వింతైన దీసృష్టి -వివరించి చూడ

నీవెవ్వరెచ్చోటు -నీది నిక్కముగ
నీవిధంబెట్టిద-ని తెలుసుకొనుము

భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

10. గడపిన సాధుసాం – గత్యము నందు
నడగును బంధము -లన్నిటి యందు

బంధముల్ తొలగిన- భ్రమవీడి పోవు
అంధకారము వీడి -యణచు మోహమును

తిమిరము వీడగ -తిరమౌ మనసు; తి
రమగు మనసుకు ధ-రణిలోనె ముక్తి

భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

11. పండు ముదుసలికి -వాంఛలెచటివి
ఎండిన నీరము, -నేరెచ్చటుండు

సిరినిన్ను వీడినన్ -సిబ్బంది యెచట
పరమాత్మనెరుగగన్ -మరుజన్మలెచట

భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

12. పరివారము సిరి యౌ-వ్వనములన్ దృటిన
హరియించు కాలము -నహమించ దగదు

మాయామయ మఖిల-మ్మంతటన్నెరిగి
మాయనణచెడి బ్ర-హ్మమ్మునెరుగుము

భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

13. దినములు నెలలేండ్లు -తిరుగచు నుండు
అనిశమాడును కాల – మాయువు తరుగు

శ్వాస పోవునదివా-స్తవ మైన గాని
నాశ పిశాచమై- యంటుకొనుండు

భజియించు గోవిందు -భజియించు సతము
త్యజియించి మోహమున్ – దరియించు భవము

మోహమున్ హరియించు -మోక్షమార్గమిది
మోహముద్గర బోధ -ముక్తినిచ్చునది….కోట శర్మ