ప్రజ – పద్యం గ్రూపు లో ఇచ్చిన సరదాగా సన్నివేశము పై వ్రాసినవి

1. మ.కో
ఎల్లవేళల వాయుయానము నెంచి సంతసమొందుచున్
వెళ్లదీసెను చాలకాలము విర్రవీగుచు గర్వియై
వల్లకాక విమానయానము వార్థిలోపడినట్టులన్
చిల్లిపడ్డటులుండిగుండెన చేతులాడకనుండగా
నల్లరైలు శరణ్యమయ్యెఁ గనన్ ధనంజయరావుకున్2. ఉత్పలమాల.
తొల్లిట జ్యేష్ఠవర్గమున దూరె టికట్టు కొనంగనాశతో
నెల్లలు లేనియల్లటలకేమియు దక్కువ లేనిచందమున్
జెల్లదు నీదు కార్డనగ జిన్నగ విక్రయదారుడంతటన్
జిల్లరలేక చిత్రముగ శ్రీసుతుడే కడు బీదవాడయెన్

3. కం.
తలవంపుకు దలబోవుచు
దలపెట్టెను జిల్లరను వెదకుడు తటుకునన్
దెలిసెను దదుపరి లేదని
ఫలితము లేవని టికెట్లు పాట్లు పెరుగుచున్

4. మ.కో
దారితోచక చేయయుద్ధము దక్కెనొక్క టికట్టు సా
ధారణాళిన బీదవారు సదా చరించెడి పెట్టెలో
పోరుచేయగ దూరగల్గెను బూర్తిగా జనులుండగా
భూరియత్నము చేసిపొందెను బోగిలో జిరుతానమున్

5. మకో
పిల్లచేతల పెద్దవారలు పెద్దగోలల పిల్లలున్
కల్లుకుండలు ఱెల్లుగడ్డియు గాలిమాటల కేకలు
న్నల్లరల్లరి చేయగాజనులంతమంది చిరాకుతో
గల్లలాడుచు రావుమిక్కిలి కష్టకాలమునుండగా

6. మకో
మెల్లమెల్లగ తోటివారలు మిత్రభాషణ చేయగా
నుల్లమందు రవంత యూరటనొందెరావు ప్రశాంతుడై
తల్లి సంస్మృతి కల్గనందొక తల్లిమాటవినంగనే
పల్లకీ యనిపించె రైలు కృపాబ్ధిలో విహరించగన్

7. పంచచామరము
నిరాశ లేశమైన లేకనే సదా హసింతురే
నిరంతరప్రమోదులైన నిత్య సత్య భాగ్యులౌ
పరోపకారచిత్తులన్న వారె వాస్తవమ్ముగా
ధరిత్రిలో ద్యులోకమీవిధమ్ముగా స్ఫురించగన్

8. కం.
ధనమే యుత్తమమనుకొను
ధనంజయుడు ధనముకంటె దానము దయలే
ఘనమనుకొని తలచెనిటుల
“మనసున్న మనిషి ధనికుడు మహిలో నరయన్”
..కోట శర్మ