కం.
హరహర! రుజహర! భవహర!
సురగణ వినుత! భుజగధర! శుభకర! పరమే
శ్వర! గిరివర! పరమ పురుష!
శరణు దురిత హర! హరినుత! శశిధర కనరా! .. కోట శర్మ

కం.
సాంబ! శుభంకర! శంకర!
అంబాపతి! అంబరీష! అంతకహంతా!
త్ర్యంబక! కల్మషకంఠ! ది
గంబర! శంభో! పురాంతకా!వందనముల్.. కోట శర్మ

కం.
త్రినయన! మునిజన వినుతా!
అనఘా! శమన దమన! మదనాంతక! పంచా
నన! నయనాయుధ! నను గన
మననము చేసెద ననయము మనమున నిన్నే!

పిలిచెదనీశ్వరా ..
చంపకమాల
పిలిచెద నీశ్వరా! వినుమ విజ్ఞత నాకును సంతరించగన్
నిలిచెద నీదు ధ్యానమున నిత్యము నిన్మదిలో స్మరించగన్
కొలిచెద నీదు రూపమును కోరికలన్నియు నంతరించగన్
తలచెద నీదు తత్వమును తత్వము నేనగుచున్ తరించగన్
…కోట శర్మ

మత్తకోకిల
శూలపాణిని చంద్రచూడుని సోమనాథుని భర్గునిన్
ఫాలనేత్రుని భూతనాథుని పార్వతీశుని శంభునిన్
కాలకంఠుని లింగమూర్తిని కాలకాలుని రుద్రునిన్
శైలవాసుని సన్నుతించెద సర్వదా స్మరియించుచున్ .. కోట శర్మ

మత్తేభవిక్రీడితము

శివునర్చించగ చిత్తశుద్ధి కలుగున్ సేవించు దాసుండవై
శివనామస్మరణమ్ము జేయుమెపుడున్ సిద్ధించునేకాగ్రతన్
శివమే నేనను వేదవాక్కు మదిలో చింతించుమెల్లప్పుడున్
భవబంధమ్ములు నిన్ను వీడునిక జీవన్ముక్తి సంప్రాప్తమై
..కోట శర్మ

వివరణ:
కర్మోపాసనలవలన కలిగే చిత్తశుద్ధి, ఏకాగ్రతలు ఆత్మవిచారణకు సాధనములు. ఈరెంటినీ సాధించిన సాధకుడు, శ్రుతి వాక్యములను శ్రవణ మననాదుల ద్వారా విచారించి, నేనే బ్రహ్మము నన్న స్ఫురణతో నిరంతరము నిధిధ్యాసన చేయగా బ్రహ్మానుభూతి సిద్ధించును.

శివము అనగా సర్వ మంగళమైన పరమాత్మ (మాండూక్యోపనిషత్ ).

ఉ.
మాపుమ మాపురమ్మున నుమాపతి! మాపును రూపుమాపుమా!
మాపరమాత్మవీవె వినుమా పరమేశ్వర! మాపురేపులున్
మాపురమందు గొల్చెదము మాపుమ చూపున నామరూపముల్
చూపును చూచునట్టి సరిచూపును చూడగ దారి చూపుమా!.. కోట శర్మ

మాపు = పోగొట్టు, మాలిన్యము
పురము = శరీరము ( స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు)
మాపురేపులు = రేయింబవళ్ళు

వివరణ:
పరమాత్మ తత్వమూర్తియైన ఉమాపతీ! మా చిత్తమాలిన్యమును నిర్మూలించుమా.
అహర్నిశలు మామదిలో నిన్ను స్మరించెదము. దృష్టిదోషమువలన కలిగిన ( ఆభాసా జనిత)
నామరూపములను లయము జేయుమా. సర్వసాక్షియైన (సమస్త దృశ్యములకు దృక్కయిన)
పరమాత్మానుభూతి కలిగించుమా.

🙏ముక్కంటిని వేడుకొంటి🙏
ఉత్పలమాల
కంటిని వేడికంటి నిలకంటికి రెప్పగ గావుమంటి, ము
క్కంటిని వేడుకొంటి నడుగంటగ గంటిని, నమ్మియుంటి చి
క్కంటిగ నింటిమింట తిగకంటియె గ్రంథిని మంటబెట్టగన్
కంటిని వెంటనంటి కఱకంఠుని నొంటిగ, నొండు లేదనిన్..కోట శర్మ

పద్యములో వాడబడిన శివుని నామములు: వేడికంటి, ముక్కంటి, తిగకంటి, కఱకంఠ.
అడుగంటు = క్షీణించు, నాశనమగు; గంటి = దుఃఖము ; చిక్కంటి = తలలో చిక్కుముడి తీసే నిడుపు దువ్వెన; ఇంటిమింట= ఇంటియొక్క మింటిలోనున్న, ఇల్లు అనగా దేహము, మింటి = ఆకాశము …. అనగా హృదయాకాశములోనున్న; గ్రంధి = చిక్కు ముడి అనగా అజ్ఞానము; మంటబెట్టు = తొలగించు; వెంటనంటి= వెంబడించి అనగా ఆశ్రయించి; ఒంటిగ = ఒక్కడేనని ( అద్వయమని) ; ఒండులేదనిన్ = ఇతరమేదీలేదని.

భావము: శివుని దర్శించి కంటికిరెప్పగ కాపాడమని కోరుకొంటిని. దుఃఖమును పోగొట్టమని వేడుకొంటిని. శివుడే తలలో చిక్కుముడిని తీసివేసే దువ్వెనలాగా నా హృదయగ్రంధులను ( చిక్కుముడి వంటి అజ్ఞానమును) తొలగిస్తాడని నమ్ముకున్నాను. శివునాశ్రయించి సర్వమూ శివమయని, ఉన్నదంతా ఆయనొక్కడేనని, వేరేమీలేదని తెలుసుకున్నాను.