కం
జననీయని జగదంబను
జనులందరు శరణువేడ సతతమ్మిలలో
కనిపించని పరతత్వమె
కనపించెడి దుర్గ మాతగాదిగి వచ్చెన్

అమ్మలకమ్మగ నిన్నే
నమ్మితి నమ్మా మనమున నామస్మరణ
మ్మిమ్ముగ చేసెద జ్ఞానము
నిమ్మని కోరుచు ననయము నిన్నే జననీ

తవచరణము మమ శరణము
భవాని నీకరుణకోరి భవహరణముకై
సవినయముగ వినుతించెద
శివశంకరి విజయవాడ శ్రీదుర్గమ్మా!
…కోట శర్మ

ఉ.
కర్మల నాచరించుటకు కారణమా శివ శక్తి మాయయే
కర్మల బంధనమ్ములకు కారణమయ్యెను ధర్మ మూర్తియై
మర్మము తెల్పి సంచితము మాయము చేయును వేద వేద్యయై
శర్మము సత్తుచిత్తులుగ సర్వము తెల్పును ముక్తి దాత్రియై.. కోట శర్మ

 

లలితా నామములతో ..

కం.
విమలా విజయా వంద్యా
రమణీ రస్యా చరాచరజగన్నాధా
సుమనా సౌమ్యా రమ్యా
కమలాక్షీ కనికరించి కావుము తల్లీ

మకో
సర్వలోకవ శంకరీ శివ శక్తి రూపిణి సర్వగా
సర్వమోహిని గుహ్యరూపిణి శర్మదాయిని దీక్షితా
సర్వతోముఖి శంభుమోహిని సర్వతాపనివారిణీ
సర్వదా నిను సన్నుతించెద సత్ప్రకాశము కోరుచున్..కోట శర్మ