Author: Kota Sarma

ఈశావాస్యోపనిషత్

ఈశావాస్యోపనిషత్-1 సీసం పరమాత్మ తత్త్వమ్ము పరిపూర్ణమైనట్టి దాద్యంతములులేనిదట్టియాత్మ ఆయాత్మనుండియే నావిర్భవించెనీ నశ్వరంబగునట్టి విశ్వమంత నామరూపాదులే నాశమౌ జగతిలో నాభాస జనితమ్ములాత్మలోన భ్రమవీడి జ్ఞానియై పరికించ విశ్వమే పరిపూర్ణమైనట్టి బ్రహ్మమగును ఆవె పూర్ణమీజగత్తు, పూర్ణమా బ్రహ్మము పూర్ణతత్త్వమందు పూర్ణముండు వేద్యమౌ జగత్తవిద్యతొలగినంత పూర్ణతత్త్వముగనె పూర్ణమందు శాంతి మంత్రం: ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే || ఓం శాంతిః శాంతిః శాంతిః | భావము కనిపించని బ్రహ్మము పూర్ణమైనది ఈ దృశ్య ప్రపంచము పూర్ణమైనది అదృశ్యుడయిన పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య ప్రపంచం వెలువడింది. దృశ్య జగత్తును పూర్ణ బ్రహ్మమునుండి వేరు చేసినప్పటికినీ ఆయన పరిపూర్ణుడే. సత్యమైన పరమాత్మ తత్వం పరిపూర్ణమైనది. ఆ పరమాత్మ నుండియే ఈ జగత్తంతా బయట ఉన్నట్లుగా తోచుచున్నది. అనగా ఆ పరమాత్మ కన్నా జగత్తు వేరుగా ఉన్నట్లు ఉన్నదని అర్ధం. కాగా జగత్తు కూడా పరిపూర్ణమైనదే అని చెప్పవలెను. ఎందుకంటే బ్రహ్మము యొక్క వివర్తమే జగత్తు కదా. పరమాత్మ నుండి ఈ జగత్తు వేరుగా, విడిగా తోచిననూ ఇది సత్యం కాదు. పరమాత్మయే సత్యం, పరిపూర్ణము. ఈశావాస్యోపనిషత్ -2. ఉత్పలమాల శాశ్వత మైన నీశ్వరుడె సర్వ జగత్తుల నిండి యుండగన్ నశ్వర నామరూపముల నన్ని జగత్తున వీడుచున్ సదా విశ్వము నీ స్వరూపమను విజ్ఞతతో సిరి కోరకెన్నడున్ విశ్వము నాశ హీనమగు విష్ణుమయమ్మని విశ్వసించుమా ఓం ఈశా వాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ | తేన త్యక్తేన భుఞజీథా మా గృధః కస్య స్విద్ధనమ్ || || ౧ || భావం ఈ జగత్తంతయు నామరూప క్రియా రహితమగు ఈశ్వర స్వరూప మాత్రముగా తిలకింపుము. ఇందలి నామాకృతి క్రియా దులను మనస్సుచేత త్యజించి, స్వరూపమను భోజనమును భుజింపుము. నీ ధనమును గానీ పర ధనమును గాని ఆశించకు. విశ్వమున గల సకలము ఈశ్వరుడేయను నిశ్చయబుద్ది కలిగియుండుము ఈశావాస్యోపనిషత్- 3 ఆటవెలది శాస్త్ర సమ్మతమగు సత్కర్మ మాత్రమే చేసి కోరు నిండు జీవితమును కర్మ ఫలితములను కడతేర్చు కొనుటకు మార్గమిదియె కర్మ మార్గికిలను కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః | ఏవం త్వయి నాన్యథేతో~స్తి న కర్మ లిప్యతే నరే || || ౨ | భావం...

Read More

విజయవాడ శ్రీదుర్గమ్మా

కం జననీయని జగదంబను జనులందరు శరణువేడ సతతమ్మిలలో కనిపించని పరతత్వమె కనపించెడి దుర్గ మాతగాదిగి వచ్చెన్ అమ్మలకమ్మగ నిన్నే నమ్మితి నమ్మా మనమున నామస్మరణ మ్మిమ్ముగ చేసెద జ్ఞానము నిమ్మని కోరుచు ననయము నిన్నే జననీ తవచరణము మమ శరణము భవాని నీకరుణకోరి భవహరణముకై సవినయముగ వినుతించెద శివశంకరి విజయవాడ శ్రీదుర్గమ్మా! …కోట శర్మ ఉ. కర్మల నాచరించుటకు కారణమా శివ శక్తి మాయయే కర్మల బంధనమ్ములకు కారణమయ్యెను ధర్మ మూర్తియై మర్మము తెల్పి సంచితము మాయము చేయును వేద వేద్యయై శర్మము సత్తుచిత్తులుగ సర్వము తెల్పును ముక్తి దాత్రియై.. కోట శర్మ   లలితా నామములతో .. కం. విమలా విజయా వంద్యా రమణీ రస్యా చరాచరజగన్నాధా సుమనా సౌమ్యా రమ్యా కమలాక్షీ కనికరించి కావుము తల్లీ మకో సర్వలోకవ శంకరీ శివ శక్తి రూపిణి సర్వగా సర్వమోహిని గుహ్యరూపిణి శర్మదాయిని దీక్షితా సర్వతోముఖి శంభుమోహిని సర్వతాపనివారిణీ సర్వదా నిను సన్నుతించెద సత్ప్రకాశము కోరుచున్..కోట...

Read More

Vedanta

మత్తేభ (అశ్వధాటి,సితస్తవకః) అశ్వధాటి నేనే యనంతుడను నేనే యసంగుడను నేనే యలక్షణుడనున్ నేనే యచింత్యుడను నేనే ప్రకాశుడను నేనే నిరంజనుడనున్ నేనే యభిన్నుడను నేనే విముక్తుడను నేనే పరాత్పరుడనున్ నేనే చిదాత్ముడను నేనే తురీయుడను నేనే యగోచరుడనున్..కోట శర్మ అశ్వధాటినేగాను బద్ధుడను నేగాను దేహమును నేగాను మూడుపురముల్ నేగాను దృశ్యమును నేగాననిత్యుడను నేగాను పంచగుహలున్ నేగాను క్షేత్రమును నేగాను గ్రాహ్యమును నేగాను నామగుణముల్ నేగాను కార్యమును నేగాను రూపమును నేగాను గోచరమునున్ పంచగుహలు = పంచకోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు) మూడు పురములు = స్థూలశరీరము, సూక్ష్మశరీరము, కారణశరీరములు .   మ.కో: ఏది చేసిన సౌఖ్యలాభము ఎంచియేగద చూడగా మోదమే ఫలితమ్ముగానిచొ మూర్ఖుడైనను చేయునా ఏది గల్గిన తుష్టి మాత్రము ఎల్ల వేళల ఉండునా ఆదచేసిన నేతినేతిగ ఆలకించగ అర్ధమౌ ఆవె. నేను కాని దాన్ని నేననే భావంబు నాది నాది యనెడి నలత పెంపు బంధ దుఃఖ ములకు భ్రాంతియె హేతువు ముక్తి మార్గమెరుగు మోక్ష గామి … కోట శర్మ కం. తనువే తానుగ తలచెడి మనసే కారణము జనన మరణమ్ములకున్ తనలో తలపులు నిలుపగ మన మనసే ముక్తినిచ్చు మార్గము చూపున్..కోట శర్మ కం. అంతటనున్నది బ్రహ్మమ నంతంబక్షర మచింత్యమవ్యవహార్య మ్మంతయుఁ దెలియునది తెలిసి నంతనె, చింతించుమట్టి యాత్మను సతమున్…కోట శర్మ శా. దేహమ్మన్నది మత్స్వరూపమను భ్రాంతిన్ నాశమొందించగా నాహం దేహమటంచు సంతతము ధ్యానావస్థయందుండగన్ కోహమ్మన్న విచారణల్ తనను నేకోహమ్ముగా చూపగా సోహం స్వానుభవమ్మగున్, విదితమౌ శ్రుత్యుక్తి మోక్షార్ధికిన్..కోట శర్మ కం. కలదని యందురు కొందరు, కలయని మరియొకరి మతము, కనికట్టుగనే కలదని వేరొకరందురు, కలదో లేదో కనుగొన గలమా కలలో?..కోట శర్మ వివరణ జీవ జగద్బ్రహ్మములలో జగతి ఉన్నదని కొందరు, బ్రహ్మములో భాగమని మరి కొందరు, మాయయని, ఛాయయని, స్వప్నమని యిలా భిన్నాభిప్రాయాలున్నాయని సూచిస్తూ వ్రాసిన పద్యము. ఉ. మాయయెలీలచేయగ నమాయకమానవు లాడుచుందురా మాయయె నిక్కమన్నటుల మైకములోబడి యాటబొమ్మలై మాయము జేయ మాయనిక మాయమె మాయలమారి చేతలే మాయను స్వప్నలోకము సమాధిన? సర్వము మాయమౌగదా!..కోట శర్మ వ్యావహారిక జగత్తంతా పారమార్ధికముగా స్వప్నతుల్యమని అంటారు కాబట్టి మాయాజనిత ద్వైత భావనను స్వప్నలోకము గా వ్రాశాను. శా....

Read More

ఓం శ్రీమాత్రే నమః

మత్త కోకిల – ర స జ జ భ ర యతి మైత్రి – 11 వ అక్షరం 🙏ఓం శ్రీ సరస్వత్యైనమః🙏 జ్ఞానరూపిణి శ్వేతధారిణి నాభిజాతుని కంగనా రాణి వందన మమ్మనాపద రాజమాలిక వేయగా వాణి మోదము కోరి వ్రాసితి వాసిగా చిరు పద్యముల్ నేనుపూనిన పద్యవాహిని నేర్పుతోకొన సాగనీ. …….కోట శర్మ….. ఆటవెలదులు 1. దుర్గ యనిన సకల దుర్గతుల్ తొలగును దుర్గ యనగ సకల దురిత హారి దుర్గ యనగ సకల దుఃఖనివారిణి కరుణ చూపు తల్లి కనక దుర్గ 2. కనకదుర్గ మల్లికార్జునులిద్దరు అమ్మవారి తోడ నయ్య వారు కొండ మీద మనకు నండగా నుండిరి కరుణ చూపు తల్లి కనక దుర్గ 3. జయము జయము నీకు జగములకు జనని జయము నిన్ను గొల్చు జనులకెపుడు జయము ధర్మమునకు జననినీవుండగన్ కరుణ చూపు మమ్మ కనక దుర్గ 4. శరణు వేడు కొందు శ్రద్ధతో యమ్మను చరణ పద్మములకు శిరము వాల్చి హరణమౌను నిక్కమన్ని దురితములు కరుణ చూపు తల్లి కనక దుర్గ 5. కోట్ల భక్త జనుల కోర్కెలు తీర్చంగ నింద్ర కీల గిరిని యిల్లు చేసి విజయ వాడ లోన వెలసెను దుర్గమ్మ కరుణ చూపు తల్లి కనక దుర్గ 6. ఆది శక్తి దుర్గ యాద్యంత రహితము నాది శక్తి! కొలిచి నంత నిన్ను నాది లేని దుఃఖ మంతమౌ మెదలంట కరుణ చూపు మమ్మ కనక దుర్గ 7. మాధవుండు ధర్మమాచరించగ నాడు కనిన సంతసించి కనికరమున కనక దుర్గ కనుక కనకవర్షమునిచ్చె కరుణ చూపు తల్లి కనక దుర్గ 8. ఫల్గుణుడు తపమును భక్తితో సేయంగ శంకరుండు మెచ్చి సంతసించి పాశుపతమునొసగె పాండవునకిచట కరుణ చూపు మల్లి...

Read More

ముక్కంటిని వేడుకొంటి

కం. హరహర! రుజహర! భవహర! సురగణ వినుత! భుజగధర! శుభకర! పరమే శ్వర! గిరివర! పరమ పురుష! శరణు దురిత హర! హరినుత! శశిధర కనరా! .. కోట శర్మ కం. సాంబ! శుభంకర! శంకర! అంబాపతి! అంబరీష! అంతకహంతా! త్ర్యంబక! కల్మషకంఠ! ది గంబర! శంభో! పురాంతకా!వందనముల్.. కోట శర్మ కం. త్రినయన! మునిజన వినుతా! అనఘా! శమన దమన! మదనాంతక! పంచా నన! నయనాయుధ! నను గన మననము చేసెద ననయము మనమున నిన్నే! పిలిచెదనీశ్వరా .. చంపకమాల పిలిచెద నీశ్వరా! వినుమ విజ్ఞత నాకును సంతరించగన్ నిలిచెద నీదు ధ్యానమున నిత్యము నిన్మదిలో స్మరించగన్ కొలిచెద నీదు రూపమును కోరికలన్నియు నంతరించగన్ తలచెద నీదు తత్వమును తత్వము నేనగుచున్ తరించగన్ …కోట శర్మ మత్తకోకిల శూలపాణిని చంద్రచూడుని సోమనాథుని భర్గునిన్ ఫాలనేత్రుని భూతనాథుని పార్వతీశుని శంభునిన్ కాలకంఠుని లింగమూర్తిని కాలకాలుని రుద్రునిన్ శైలవాసుని సన్నుతించెద సర్వదా స్మరియించుచున్ .. కోట శర్మ మత్తేభవిక్రీడితము శివునర్చించగ చిత్తశుద్ధి కలుగున్ సేవించు దాసుండవై శివనామస్మరణమ్ము జేయుమెపుడున్ సిద్ధించునేకాగ్రతన్ శివమే నేనను వేదవాక్కు మదిలో చింతించుమెల్లప్పుడున్ భవబంధమ్ములు నిన్ను వీడునిక జీవన్ముక్తి సంప్రాప్తమై ..కోట శర్మ వివరణ: కర్మోపాసనలవలన కలిగే చిత్తశుద్ధి, ఏకాగ్రతలు ఆత్మవిచారణకు సాధనములు. ఈరెంటినీ సాధించిన సాధకుడు, శ్రుతి వాక్యములను శ్రవణ మననాదుల ద్వారా విచారించి, నేనే బ్రహ్మము నన్న స్ఫురణతో నిరంతరము నిధిధ్యాసన చేయగా బ్రహ్మానుభూతి సిద్ధించును. శివము అనగా సర్వ మంగళమైన పరమాత్మ (మాండూక్యోపనిషత్ ). ఉ. మాపుమ మాపురమ్మున నుమాపతి! మాపును రూపుమాపుమా! మాపరమాత్మవీవె వినుమా పరమేశ్వర! మాపురేపులున్ మాపురమందు గొల్చెదము మాపుమ చూపున నామరూపముల్ చూపును చూచునట్టి సరిచూపును చూడగ దారి చూపుమా!.. కోట శర్మ మాపు = పోగొట్టు, మాలిన్యము పురము = శరీరము ( స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు) మాపురేపులు = రేయింబవళ్ళు వివరణ: పరమాత్మ తత్వమూర్తియైన ఉమాపతీ! మా చిత్తమాలిన్యమును నిర్మూలించుమా. అహర్నిశలు మామదిలో నిన్ను స్మరించెదము. దృష్టిదోషమువలన కలిగిన ( ఆభాసా జనిత) నామరూపములను లయము జేయుమా. సర్వసాక్షియైన (సమస్త దృశ్యములకు దృక్కయిన) పరమాత్మానుభూతి కలిగించుమా. 🙏ముక్కంటిని వేడుకొంటి🙏 ఉత్పలమాల కంటిని వేడికంటి నిలకంటికి రెప్పగ గావుమంటి, ము క్కంటిని...

Read More