పేకాటతోయఘులు

మత్తేభ (అశ్వధాటి,సితస్తవకః)
 
ఏకాలముంగనిన నాకాలమందునను పేకాటలాడదగునే
పేకాటరాయుడులు యేకాడికీవదల నాకాటలోకమనుచున్
పేకాటతోయఘులు ప్రాకారమున్నిలిపి యేకాకిలాబ్రతుకుచున్
నాకారులైయిటుల లోకాలనుమ్మరచి పేకాటతోగడపగన్
చేకావలిన్ దులిపి చేకాసులున్ కడకు జూకాలనూవదలకన్
రాకాసిలానిలిచి పేకాటనేయిలన పోకార్చుజీవితములన్
పేకాటజూదరులు ప్రాకాశమున్ దొలగి శోకాలలోముణుగునే
పోకాలమేకలిగి ఢోకాలతోనలిగి బేకారులైకుములుగా
రాకాలమందుగెలు పేఖాయమైనటుల నీకాశదేనికి సుమా
పేకాటపోవిడిచి శోకాలుమాయమగు దాకా శివున్ వదలకన్
ఈకాలమందె,దహ రాకాశమందలిని రాకారునూగొలువురా
శోకాలువైదొలగు శ్లోకాలతోదినము శ్రీకారమున్ పలుకరా!… కోట శర్మ
అనాకాలము=వేళకానివేళ; అఘులు=పాపులు;
నాకారులు= పనికిమాలిన వారు; పోకార్చు = నాశనము చేయు;
చేకావలి= ఇంటిలోని డబ్బు ; చేకాసులు= చేతిలోని డబ్బు ;
ప్రాకాశము= కీర్తి, వెలుగు; దహరాకాశము= చిదాకాశము;
ముణుచు=ముంచు; ఢోకా=మోసం.

Read More

తత్వ చింతన – అవస్థాత్రయ వివరణ

తత్వ చింతన – అవస్థాత్రయ వివరణ
కం. మెలకువ నిదురయు కలలను
త్రిలోక ములలో మనుజుడు తిరుగును నిలలో
మెళుకువతో లోకమ్ములు
తిలకించగ విదితమగును తీరు తరింపన్
కం. మెలగును తనువును మనసును
మెలకువలో, మనసొకటియె మెదలును కలలో
కలిపించి లేని జగతిని,
కలలుకనని నిదురలోన కనబడ వేవీ!
కం. మెలకువ లో కనబడునవి
కలలో నుండవు, కలిగిన కల కనుమరుగౌ
మెలకువలో, మాయమగు స
కలము నిదురలో, సకలము కనునది నీవే…. కోట శర్మ
వివరణ: జ్ఞాన మార్గమున ఆత్మవిచారణకు తద్వారా అపరోక్షానుభూతికి అవస్థాత్రయ పరిశీలన మావశ్యకము.
జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనగా గాఢనిద్రలు అందరికీ అనుభవములోనున్న విషయాలే.
మెలకువగా ఉన్నప్పుడు మనిషి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములతో పాటు అంతఃకరణముతో వ్యవహరిస్తాడు.
కాని కలలో కేవలము మనసుతో మాత్రమే మెలగును. కలలు లేని గాఢనిద్ర యందు మనసుకాడా వ్యవహరించదు. కలలో వస్తువులు ప్రాతిభాసికాలు అనగా మిథ్య అయి ఉంటాయి. ఆవస్తువులే మెలకువలో స్థిరంగా, వ్యావహారికంగా ఉంటాయి. కాని ఈ రెండు అవస్థల్లోనూ కలిగే జ్ఞానం మాత్రం ఒకటే.
గాఢనిద్రనుండి మేల్కొన్న వ్యక్తికి, నిద్రలో తనకు ఏమీ తెలియలేదు అనే అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం స్మృతిరూపంలో ఉంటోంది. అనుభవం లేకపోతే దాని జ్ఞాపకమే ఉండదు కదా! కాబట్టి గాఢనిద్ర లో “ఏమీ తెలియకపోవటం అనేది ” అనుభవమైనదని తెలుస్తోంది. ఈ అజ్ఞానానుభవస్మృతే మేల్కొన్నప్పుడు కలుగుతోంది. కాబట్టి గాఢనిద్రలో బాహ్యకరణములు, అంతఃకరణము పనిచేయకపోయినప్పటికీ, జ్ఞానముంటుందని తెలుస్తోంది.
మూడుస్థితులలోనూ మారిపోతున్న వస్తువులను తాను మారకుండా, సాక్షీరూపంగా, ఏకరూపంగా గమనిస్తున్న జ్ఞానమే ఆత్మ స్వరూపము. నీ అసలు రూపము.. కోట శర్మ
సీ. కలయందు మెదలును – కల్ల నిజము గాను
కలగనునపుడె యా- కలలు నిజము
మెలకువన జగము – మెదలు స్ధిరముగాను
లోకమెల్ల నిజము – లౌకికముగ
దేహమే నేనన్న- ఊహ వీడి నపుడె
నీవు నిత్య మనెడి – నిజము నిజము
ఉన్నదంతబ్రహ్మ- మొక్కటన్న నిజము
నీవెరిగినపుడె – నీవు నిజము
ఆవె. నీది నాది యన్న భేదంబు లేదని
పారమార్ధికమున పఱగ దగును
నేను నీవు వేరు, మేను నేనేయన్న,
శంకరుండు జెప్ప శంక లేల
వివరణ:
శ్రోత్రాది ఇంద్రియాలు ఉపశమించగా, జాగ్రదావస్థలోని సంస్కారాలవల్ల కలిగిన విషయజ్ఞానాన్నే స్వప్నం అంటారు. జాగ్రదవస్థలో మనం ఒక వస్తువును చూచినపుడు అది మనకు స్థిరంగా, వ్యావహారికంగా స్పష్టమైన జ్ఞానం ఇస్తుంది. స్వప్నంలో ఆ వస్తువును చూచినపుడు, ఆ వస్తువులాగా (ప్రాతిభాసికంగా) కనిపిస్తుంది. ఇదే ప్రాతిభాసిక జ్ఞానం. ఇది స్థిరంగా, స్ఫుటంగా ఉండదు.
స్వప్నంలో మనమెన్నో దృశ్యాలు ప్రత్యక్షంగా చూచినట్టే చూస్తుంటాము. అవన్నీ మనకప్పటి కప్పుడెంతో యదార్ధంగానే భాసిస్తుంటాయి. అసత్యమనే భావన ఏ మాత్రమూ మనసుకురాదు. అలా చూస్తున్నంతసేపూ అది సత్యమే. కాని ఉన్నట్టుండి మెళుకువ వస్తే చాలు. మరుక్షణమే మటుమాయమై అంతా అసత్యమని తేలిపోతుంది. అయితే మెళుకువ వచ్చేంతవరకూ తాత్కాలికంగానైనా అది సత్యమే. దీనినే ప్రాతిభాసిక సత్యమంటారు శంకరభగవత్పాదులు.
అలాగే ఈ లోక వ్యవహారం కూడా మానవుడికాత్మ ప్రబోధం కలిగేంత వరకూ సత్యమే. అజ్ఞాన జనితమైన దేహాత్మభావము ( అనగా దేహమే నేనన్న అపోహ ) ఉన్నంత వరకూ లోకవ్యవహారము సత్యమే. దీనికి వ్యావహారిక సత్యమని పేరు. ఆ తరువాతనే ఇది అసత్యం. అప్పుడు కూడా అందరికీ కాదు. ఎవరికి ప్రబోధం కలిగిందో వారికే. మిగతా వాళ్ళకంతా మరలా సత్యమే. అపరోక్షానుభూతి కలిగిన జ్ఞానులకు తమ సహజస్థితిలో పారమార్ధిక సత్యమును, సచ్చిదానందరూపమైన బ్రహ్మమే సత్యమూ, సర్వవ్యాపకముగా అనుభవం కలుగుతుంది. జీవ బ్రహ్మ జగత్ ల అభేదభావము పారమార్థిక సత్యము.

Read More

సరదాగా సన్నివేశము

ప్రజ – పద్యం గ్రూపు లో ఇచ్చిన సరదాగా సన్నివేశము పై వ్రాసినవి
1. మ.కో
ఎల్లవేళల వాయుయానము నెంచి సంతసమొందుచున్
వెళ్లదీసెను చాలకాలము విర్రవీగుచు గర్వియై
వల్లకాక విమానయానము వార్థిలోపడినట్టులన్
చిల్లిపడ్డటులుండిగుండెన చేతులాడకనుండగా
నల్లరైలు శరణ్యమయ్యెఁ గనన్ ధనంజయరావుకున్2. ఉత్పలమాల.
తొల్లిట జ్యేష్ఠవర్గమున దూరె టికట్టు కొనంగనాశతో
నెల్లలు లేనియల్లటలకేమియు దక్కువ లేనిచందమున్
జెల్లదు నీదు కార్డనగ జిన్నగ విక్రయదారుడంతటన్
జిల్లరలేక చిత్రముగ శ్రీసుతుడే కడు బీదవాడయెన్
3. కం.
తలవంపుకు దలబోవుచు
దలపెట్టెను జిల్లరను వెదకుడు తటుకునన్
దెలిసెను దదుపరి లేదని
ఫలితము లేవని టికెట్లు పాట్లు పెరుగుచున్
4. మ.కో
దారితోచక చేయయుద్ధము దక్కెనొక్క టికట్టు సా
ధారణాళిన బీదవారు సదా చరించెడి పెట్టెలో
పోరుచేయగ దూరగల్గెను బూర్తిగా జనులుండగా
భూరియత్నము చేసిపొందెను బోగిలో జిరుతానమున్
5. మకో
పిల్లచేతల పెద్దవారలు పెద్దగోలల పిల్లలున్
కల్లుకుండలు ఱెల్లుగడ్డియు గాలిమాటల కేకలు
న్నల్లరల్లరి చేయగాజనులంతమంది చిరాకుతో
గల్లలాడుచు రావుమిక్కిలి కష్టకాలమునుండగా
6. మకో
మెల్లమెల్లగ తోటివారలు మిత్రభాషణ చేయగా
నుల్లమందు రవంత యూరటనొందెరావు ప్రశాంతుడై
తల్లి సంస్మృతి కల్గనందొక తల్లిమాటవినంగనే
పల్లకీ యనిపించె రైలు కృపాబ్ధిలో విహరించగన్
7. పంచచామరము
నిరాశ లేశమైన లేకనే సదా హసింతురే
నిరంతరప్రమోదులైన నిత్య సత్య భాగ్యులౌ
పరోపకారచిత్తులన్న వారె వాస్తవమ్ముగా
ధరిత్రిలో ద్యులోకమీవిధమ్ముగా స్ఫురించగన్
8. కం.
ధనమే యుత్తమమనుకొను
ధనంజయుడు ధనముకంటె దానము దయలే
ఘనమనుకొని తలచెనిటుల
“మనసున్న మనిషి ధనికుడు మహిలో నరయన్”
..కోట శర్మ

Read More

తత్వమసి..స్వామి వివేకానందుడి దృష్టాంతము ఆధారంగా

తత్వమసి
స్వామి వివేకానందుడి దృష్టాంతము ఆధారంగా
మత్తకోకిల
తల్లినుండొక పిల్ల సింహము దారి తప్పగ దూరమై
వెళ్ళిచేరెను గొర్రెమందన భీతితో విలపించుచున్
యెల్లవేళల గొర్రెగా బ్రతుకీడ్చు చుండెను మందలో
నల్లవేరొక సింహమావిషయమ్ము చూసెను వింతగన్
చెంతచేరెను పెద్దసింహము చిన్నగా కడు ప్రీతితో
“చింతలెందుకు నీదురూపము సింహమే”నని చెప్పుచున్
భ్రాంతినంతము చేయ సింగపు బల్మి తీరులు తెల్పగన్
స్వంతరూపము గన్న చిన్నది సంతసించెను సింహమై
ఉన్న శక్తిని విస్మరించగ నుత్తగొర్రెగ నున్ననా
చిన్నసింహపు చందమున్ మరచేను జీవుడు తత్వమున్
ఖిన్నుడయ్యెనవిద్యచే పరికించకన్ తన రూపమున్
విన్నయే పరమౌషధమ్మవివేకమంతము చేయగన్..కోట శర్మ
విన్న = విజ్ఞ
వివరణ: ఒక సింహము పిల్ల దారి తప్పి జింకలగుంపులో చేరి తను సింహానినన్న విషయము మరచి జింకలలాగా భయపడుతూ బ్రతుకుతూ ఉంటుంది. కొన్నాళ్ల తరువాత దానిని వేరేసింహము చూసి దానికి సరస్సు నీటి లో దాని ప్రతిబింబము చూపి దాని అసలుస్వరూపము తెలియజేస్తుంది. తన నిజస్వరూపజ్ఞానము కలిగాక అది సింహములా ధైర్యంగా బతుకుతుంది.
ఇక్కడ దాని అసలు స్వరూపమెప్పుడూ సింహమే. కాని అజ్ఞానము వలన కలిగిన అపోహ వలన జింకలా బ్రతకాల్సివచ్చింది. ఆతరువాత జ్ఞానము కలగి సింహమని తెలుసుకొని సుఖంగా బ్రతికింది.
అలాగే మనకు తెలిసినా తెలియకపోయినా మన అసలు రూపము బ్రహ్మమే. అవిద్య వలన దేహాత్మ భావము , అహంకారము, మమకారము, బంధాలూ, దుఃఖాలూ కలుగుతున్నాయి. మనకు జ్ఞానము కలిగాక మనము మన అసలు రూపమైన బ్రహ్మమవుతాము. అందుకనే బ్రహ్మవేదా బ్రహ్మైవభవతి అని శ్రుతివాక్యము. మన అసలు స్వరూపమే సత్, చిత్ ఆనందరూపమైన బ్రహ్మము కాబట్టి మన నిజరూపము లో దుఃఖములకు తావు లేని నిత్యమూ ఆనందమూ మనమే. ఆ ఆత్మజ్ఞాన అపరోక్షానుభూతియే జీవన్ముక్తిYOU ARE A LION
I will tell you a story. A lioness in search of prey came upon a flock of sheep, and as she jumped at one of them, she gave birth to a cub and died on the spot. The young lion was brought up in the flock, ate grass, and bleated like a sheep, and it never knew that it was a lion. One day a lion came across the flock and was astonished to see in it a huge lion eating grass and bleating like a sheep. At his sight the flock fled and the lion-sheep with them. But the lion watched his opportunity and one day found the lion-sheep asleep. He woke him up and said, “You are a lion.” The other said, “No,” and began to bleat like a sheep. But the stranger lion took him to a lake and asked him to look in the water at his own image and see if it did not resemble him, the stranger lion. He looked and acknowledged that it did. Then the stranger lion began to roar and asked him to do the same. The lion-sheep tried his voice and was soon roaring as grandly as the other. And he was a sheep no longer. My friends, I would like to tell you all that you are mighty as lions.
SOURCE: The Complete Works of Swami Vivekananda; Volume-1 PP: 326-7

Read More

నాన్న..

నాన్న..
ఉ.
సంతతితోడనాడుచును సఖ్యుడుగా మురిపించు నాన్న యా
సంతుకు సంప్రదాయమును సన్మతి సంపదలిచ్చు నొజ్జయై
సంతతి సంతసించుటకు సంతతమున్ శ్రమియించుచుండి తా
సంతసమొందు నాన్న తన సర్వము త్యాగము చేసి వారికై ..కోట శర్మ

Read More