ఈశావాస్యోపనిషత్

ఈశావాస్యోపనిషత్-1
సీసం
పరమాత్మ తత్త్వమ్ము పరిపూర్ణమైనట్టి
దాద్యంతములులేనిదట్టియాత్మ
ఆయాత్మనుండియే నావిర్భవించెనీ
నశ్వరంబగునట్టి విశ్వమంత
నామరూపాదులే నాశమౌ జగతిలో
నాభాస జనితమ్ములాత్మలోన
భ్రమవీడి జ్ఞానియై పరికించ విశ్వమే
పరిపూర్ణమైనట్టి బ్రహ్మమగును
ఆవె
పూర్ణమీజగత్తు, పూర్ణమా బ్రహ్మము
పూర్ణతత్త్వమందు పూర్ణముండు
వేద్యమౌ జగత్తవిద్యతొలగినంత
పూర్ణతత్త్వముగనె పూర్ణమందు
శాంతి మంత్రం:
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః |
భావము
కనిపించని బ్రహ్మము పూర్ణమైనది ఈ దృశ్య ప్రపంచము పూర్ణమైనది అదృశ్యుడయిన పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య ప్రపంచం వెలువడింది. దృశ్య జగత్తును పూర్ణ బ్రహ్మమునుండి వేరు చేసినప్పటికినీ ఆయన పరిపూర్ణుడే.
సత్యమైన పరమాత్మ తత్వం పరిపూర్ణమైనది. ఆ పరమాత్మ నుండియే ఈ జగత్తంతా బయట ఉన్నట్లుగా తోచుచున్నది. అనగా ఆ పరమాత్మ కన్నా జగత్తు వేరుగా ఉన్నట్లు ఉన్నదని అర్ధం. కాగా జగత్తు కూడా పరిపూర్ణమైనదే అని చెప్పవలెను. ఎందుకంటే బ్రహ్మము యొక్క వివర్తమే జగత్తు కదా. పరమాత్మ నుండి ఈ జగత్తు వేరుగా, విడిగా తోచిననూ ఇది సత్యం కాదు. పరమాత్మయే సత్యం, పరిపూర్ణము.
ఈశావాస్యోపనిషత్ -2.
ఉత్పలమాల
శాశ్వత మైన నీశ్వరుడె సర్వ జగత్తుల నిండి యుండగన్
నశ్వర నామరూపముల నన్ని జగత్తున వీడుచున్ సదా
విశ్వము నీ స్వరూపమను విజ్ఞతతో సిరి కోరకెన్నడున్
విశ్వము నాశ హీనమగు విష్ణుమయమ్మని విశ్వసించుమా
ఓం ఈశా వాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ |
తేన త్యక్తేన భుఞజీథా మా గృధః కస్య స్విద్ధనమ్ || || ౧ ||
భావం
ఈ జగత్తంతయు నామరూప క్రియా రహితమగు ఈశ్వర స్వరూప మాత్రముగా తిలకింపుము. ఇందలి నామాకృతి క్రియా దులను మనస్సుచేత త్యజించి, స్వరూపమను భోజనమును భుజింపుము. నీ ధనమును గానీ పర ధనమును గాని ఆశించకు. విశ్వమున గల సకలము ఈశ్వరుడేయను నిశ్చయబుద్ది కలిగియుండుము
ఈశావాస్యోపనిషత్- 3
ఆటవెలది
శాస్త్ర సమ్మతమగు సత్కర్మ మాత్రమే
చేసి కోరు నిండు జీవితమును
కర్మ ఫలితములను కడతేర్చు కొనుటకు
మార్గమిదియె కర్మ మార్గికిలను
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః |
ఏవం త్వయి నాన్యథేతో~స్తి న కర్మ లిప్యతే నరే || || ౨ |
భావం
శాస్త్ర సమ్మతము లయిన కర్మలను చేయుచు మాత్రమే మానవుడు వంద సంవత్సరాలు జీవించవలెనని కోరు కొనవలెను.
జీవితము పైన మమకారము ఉన్నంత వరకు దుష్కర్మ కాలుష్యము లను పోగొట్టుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు.
4.
ఆటవెలది
ఆత్మ నెరుగని జనులజ్ఞాన తమసుచే
కామ్య కర్మలందు గడిపి బతుకు
మరణమొందినపుడు నరక లోకములందు
బాధ లనుభవించి భవమునొందు
అసుర్యా నామ తే లోకా అన్ధేన తమసా~వృతాః |
తాంస్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యే కే చాత్మహనో జనాః || || ౩ ||
భావం
అవిద్యా దోషమున ఆత్మ నెరుగని విద్వాంసులు అజ్ఞానమను తమస్సుచే ఆవరింపబడిన దేవాది లోకములను దేహము విడిచిన తర్వాత పొందుదురు.
ఈశావాస్యోపనిషత్ – 4
సీ.
నిండి యంతట నుండి నిశ్చలంబైనను
మనసు కంటెన్ వేగమైనదాత్మ
పరుగులో నన్నింట పరమాత్మయే మిన్న
ఇంద్రియమ్ములు దాని నెరుగ లేవు
జీవులా యాత్మచే జీవించుచుందురు
చలనరహిత మాత్మ చలనమదియె
చేరువగనదియె దూరముగనదియె
ఆత్మయే జగతిలో నంతటయును
ఆటవెలది
బయట లోపలయును వ్యాపించి యున్నట్టి
యాత్మ నెవరు జీవులందు జూచి
యాత్మలోన జీవులందరిని గనునో
యట్టివారికేది గిట్టమికను
భావము (4,5,6 మంత్రములు)
అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్పూర్వమర్షత్ |
తద్ధావతో~న్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి || || ౪ |
పరమాత్మ నిశ్చలమైనననూ మనసు కంటే వేగమైనది. ఇంద్రియాలకు అతీతమైనది. అనగా పరమాత్మను చేరుకోలేవు. కనుక అది అన్నటి కంటే అతివేగంగా పరుగిడ గలదు. విశ్వంలోని సమస్త జీవులు దానివలననే జీవించగలుగుతున్నారు.
తదేజతి తత్రైజతి తద్దూరే తద్వన్తికే |
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః || || ౫ |
ఆత్మ చలించును. చలింపదు. ఆత్మ అతిదగ్గరగా వుండును అట్లే అతి దూరముగా కూడా ఉండును. ప్రపంచమునకు లోపల అంతా వ్యాపించి ఉండును అట్లే బయట వ్యాపించి ఉన్నదంతయు ఆత్మయే.
యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి |
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే || || ౬ |
ఎవరైతే అన్ని జీవులలో తన ఆత్మను చూస్తాడో అలాగే అన్ని జీవులలో తనను చూడగలుగుతాడో అతడు ఎవరినీ ద్వేషించడు.

Read More

విజయవాడ శ్రీదుర్గమ్మా

కం
జననీయని జగదంబను
జనులందరు శరణువేడ సతతమ్మిలలో
కనిపించని పరతత్వమె
కనపించెడి దుర్గ మాతగాదిగి వచ్చెన్
అమ్మలకమ్మగ నిన్నే
నమ్మితి నమ్మా మనమున నామస్మరణ
మ్మిమ్ముగ చేసెద జ్ఞానము
నిమ్మని కోరుచు ననయము నిన్నే జననీ
తవచరణము మమ శరణము
భవాని నీకరుణకోరి భవహరణముకై
సవినయముగ వినుతించెద
శివశంకరి విజయవాడ శ్రీదుర్గమ్మా!
…కోట శర్మ
ఉ.
కర్మల నాచరించుటకు కారణమా శివ శక్తి మాయయే
కర్మల బంధనమ్ములకు కారణమయ్యెను ధర్మ మూర్తియై
మర్మము తెల్పి సంచితము మాయము చేయును వేద వేద్యయై
శర్మము సత్తుచిత్తులుగ సర్వము తెల్పును ముక్తి దాత్రియై.. కోట శర్మ
 
లలితా నామములతో ..
కం.
విమలా విజయా వంద్యా
రమణీ రస్యా చరాచరజగన్నాధా
సుమనా సౌమ్యా రమ్యా
కమలాక్షీ కనికరించి కావుము తల్లీ
మకో
సర్వలోకవ శంకరీ శివ శక్తి రూపిణి సర్వగా
సర్వమోహిని గుహ్యరూపిణి శర్మదాయిని దీక్షితా
సర్వతోముఖి శంభుమోహిని సర్వతాపనివారిణీ
సర్వదా నిను సన్నుతించెద సత్ప్రకాశము కోరుచున్..కోట శర్మ

Read More

Vedanta

మత్తేభ (అశ్వధాటి,సితస్తవకః)
అశ్వధాటి
నేనే యనంతుడను నేనే యసంగుడను నేనే యలక్షణుడనున్
నేనే యచింత్యుడను నేనే ప్రకాశుడను నేనే నిరంజనుడనున్
నేనే యభిన్నుడను నేనే విముక్తుడను నేనే పరాత్పరుడనున్
నేనే చిదాత్ముడను నేనే తురీయుడను నేనే యగోచరుడనున్..కోట శర్మ
అశ్వధాటినేగాను బద్ధుడను నేగాను దేహమును నేగాను మూడుపురముల్
నేగాను దృశ్యమును నేగాననిత్యుడను నేగాను పంచగుహలున్
నేగాను క్షేత్రమును నేగాను గ్రాహ్యమును నేగాను నామగుణముల్
నేగాను కార్యమును నేగాను రూపమును నేగాను గోచరమునున్
పంచగుహలు = పంచకోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు)
మూడు పురములు = స్థూలశరీరము, సూక్ష్మశరీరము, కారణశరీరములు .
 
మ.కో:
ఏది చేసిన సౌఖ్యలాభము ఎంచియేగద చూడగా
మోదమే ఫలితమ్ముగానిచొ మూర్ఖుడైనను చేయునా
ఏది గల్గిన తుష్టి మాత్రము ఎల్ల వేళల ఉండునా
ఆదచేసిన నేతినేతిగ ఆలకించగ అర్ధమౌ
ఆవె.
నేను కాని దాన్ని నేననే భావంబు
నాది నాది యనెడి నలత పెంపు
బంధ దుఃఖ ములకు భ్రాంతియె హేతువు
ముక్తి మార్గమెరుగు మోక్ష గామి
… కోట శర్మ
కం.
తనువే తానుగ తలచెడి
మనసే కారణము జనన మరణమ్ములకున్
తనలో తలపులు నిలుపగ
మన మనసే ముక్తినిచ్చు మార్గము చూపున్..కోట శర్మ
కం.
అంతటనున్నది బ్రహ్మమ
నంతంబక్షర మచింత్యమవ్యవహార్య
మ్మంతయుఁ దెలియునది తెలిసి
నంతనె, చింతించుమట్టి యాత్మను సతమున్…కోట శర్మ
శా.
దేహమ్మన్నది మత్స్వరూపమను భ్రాంతిన్ నాశమొందించగా
నాహం దేహమటంచు సంతతము ధ్యానావస్థయందుండగన్
కోహమ్మన్న విచారణల్ తనను నేకోహమ్ముగా చూపగా
సోహం స్వానుభవమ్మగున్, విదితమౌ శ్రుత్యుక్తి మోక్షార్ధికిన్..కోట శర్మ
కం.
కలదని యందురు కొందరు,
కలయని మరియొకరి మతము, కనికట్టుగనే
కలదని వేరొకరందురు,
కలదో లేదో కనుగొన గలమా కలలో?..కోట శర్మ
వివరణ
జీవ జగద్బ్రహ్మములలో జగతి ఉన్నదని కొందరు, బ్రహ్మములో భాగమని మరి కొందరు, మాయయని, ఛాయయని, స్వప్నమని యిలా భిన్నాభిప్రాయాలున్నాయని సూచిస్తూ వ్రాసిన పద్యము.
ఉ.
మాయయెలీలచేయగ నమాయకమానవు లాడుచుందురా
మాయయె నిక్కమన్నటుల మైకములోబడి యాటబొమ్మలై
మాయము జేయ మాయనిక మాయమె మాయలమారి చేతలే
మాయను స్వప్నలోకము సమాధిన? సర్వము మాయమౌగదా!..కోట శర్మ
వ్యావహారిక జగత్తంతా పారమార్ధికముగా స్వప్నతుల్యమని అంటారు కాబట్టి మాయాజనిత ద్వైత భావనను స్వప్నలోకము గా వ్రాశాను.
శా. నేనే నేను విముక్తవిజ్ఞుడను నేనే నిర్విశేషాత్ముడన్
నేనే నేను వికారదూరుడను నేనే సచ్చిదానందుడన్
నేనే నేను నిరంజనాత్ముడను నేనే బ్రహ్మరూపాత్ముడన్
నేనే నేనవికల్పనిత్యుడను నేనే శుద్ధ చైతన్యుడన్.. కోట శర్మ
శ్రీ శంకరాచార్యకృత బ్రహ్మజ్ఞానావళీమాలా నుండి కొన్ని పద్యముల ఆధారముగా వ్రాసిన పద్యము.
భావము: నేను గుణక్రియాది సర్వవిశేషరహితమగు జ్ఞానస్వరూపుడను, దృశ్య పదార్ధములతో దేనితోను సంగము కలవాడను కాను, వికారదూరుడను. నేను సచ్చిదానందస్వరూపుడను. నేనే నిత్య శుద్ధ బ్రహ్మస్వరూపుడను. అహమేవాహం = నేను నేనే
ఉ.
దీక్ష తితీక్ష వీక్షయును తీవ్రతరంబగు కాంక్షయున్ లలా
టాక్షుని లేశమాత్రపు కటాక్షమునక్షర శిక్ష బోధలున్
మోక్షము పొంద గోరిన ముముక్షుని కిచ్చును దక్షతన్, సదా
సాక్షిగ తక్షణమ్ము తన చక్షువు చూచునలక్షణుండుగా/నై..కోట శర్మ
తితీక్ష = సహనము, వీక్ష = దృష్టి ( విశేష దృష్టి ), అక్షర శిక్ష = బ్రహ్మతత్వము,
దక్షత = నేర్పు, చక్షువు = జ్ఞాననేత్రము.
వివరణ:
దృఢ సంకల్పము, సహనము, నిత్యానిత్య వివేకము ( విశేష దృష్టి ), తీవ్రమైన మోక్షకాంక్ష, ఫాలనేత్రుని కృప మరియు సద్గురు బ్రహ్మతత్వ ( శ్రుతివాక్య) బోధలూ ముముక్షువుకు తనను అలక్షణుడు, అవ్యవహార్యమైన సాక్షిగ తెలుపు అనుభవజ్ఞానము కలుగుటకు అర్హతను/ నేర్పును కలిగించును.
సీ.
నలువిధమ్ముల దేవునర్చింత్రు ధరణిలో
సద్భక్తు లైనట్టి సత్పురుషులు
చింతలున్నప్పుడె చింతించు చిత్తము
నార్తరక్షకుడంచు నార్తుడొకడు
నైశ్వర్యమాసించి యీశ్వరునర్చించు
నట్టిద్వితీయుడర్ధార్ధియితడు
జిజ్ఞాసు ధ్యానించు సుజ్ఞాన సిధ్ధికై
దేవభక్తులలో తృతీయుడితడు
తే.
జ్ఞానమెరిగిన భక్తుడే జ్ఞాని యగును
నిత్య సత్యమునెపుడు ధ్యానించు చుండు
యోగిగాపరమాత్మతోయుండు నెపుడు
భక్తులందుత్తముడు ప్రియ భక్తుడితడు
…కోట శర్మ
భగవద్గీత 7.16 & 17
చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినో అర్జున | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ||
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ||
తాత్పర్యం
” భరత శ్రేష్ఠా ! ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞాని … ఈ నాలుగు విధాల మనుష్యులే ‘ నన్ను ’ ‘ ఆత్మ ’ ను సేవిస్తున్నారు. “
ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్టుడు.అటువంటి వాడికి నేను ఎక్కువ ప్రియుణ్ణి.అతడే నాకు కూడా ఇష్టుడు.
కం.
కనిపించినదనిపించును
కనికట్టుగమరలివచ్చు కనుమూసినచో
కనిపెట్టుటకేమికలదు
కనిపించునదంతయొట్టికలయేగనుమా..కోట శర్మ
కనుమూసినచో = ఏమరచినచో
Be Here And Now
సీ.
ఆలోచన యనిన -నక్కడ లోచన
మాలోచనే యాన-మత్తరికిని
నాలోచనేయగు -నావేశతాపాదు
లాలోచనేయగు-నారు యరులు
నాలోచనేహేతు-వన్ని కష్టములకు
నాలోచనేశత్రు -వందరికిని
నెల్లపుడుండిన -నిప్పుడే యిక్కడే
యన్ని యాలోచన-లంత మగును
ఆ.వె
తలపులె మన కన్ని-తంటలనిచ్చును
తలచు వాడెవరని -తలచిన తన
తలపులు తొలగునని -తలచుచు మనసుకు
తలుపు మూయ దగును -తక్ష ణంబు
…కోట శర్మ
అక్కడ లోచనము = వేరొకచోట దృష్టి అని భావము.
వివరణ
ఆలోచన మనకు పెద్ద శత్రువు. ఉన్నచోటునండి ఉన్న క్షణమునుండి వేరే చోటుకో వేరే కాలమునుకో ( అనగా గతమునకో భవిష్యత్తు లోకో) ప్రయాణించటమే ఆలోచన. ఆలోచనలే అసూయ, ద్వేషము, కోపాదులుగా మారి మనకు దఃఖము కలిగిస్తాయి. మనమెల్లప్పడూ వర్తమానములోనుండిన (అనగా ఇక్కడే ఇప్పుడే) మనకాలోచనలుండవు.
అలాగే రమణ మహర్షి చెప్పినట్లు ఆలోచన వచ్చినప్పుడల్లా ఎవరికీ యాలోచనవచ్చినదని విచారిస్తే మనసు లయమై ఆలోచనలు లేని సహజస్థితిని పొందగలమని భావము
( Based on talks by Jiddu Krishnamurti, Satyanarayana Goenka and Ramana Maharshi )
( In English for the sake of clarity)
Thought is man’s biggest enemy. Thought is nothing but travelling in space and time either into past or into future. Thoughts when nurtured take the form of anger, jealousy, aversion, hatred etc. Thought can not arise as long as you stay here and now. Alternatively, as Ramana Maharshi preached, try to find the source of thought every time it arises. This Enquiry dissolves the mind and all thoughts.
సీ.హారకేయూరాది-యాభరణంబులు
వేరుగా ననిపించు – వేరు గావు
నశియించెడివి రూప- నామంబు లగువేరు
మారనట్టి కనక – మవదు వేరు
అలలు బుద్బుదఫేన – లగుపించు వేరుగ
ఆధారమగు నీర – మవదు వేరు
నీరుబంగారముల్ – తీరుగ సత్యమె
అనయమౌ బ్రహ్మము – కసలు రూపు
తే.రూపనామముల్ జగతికి – రూపమగును
భాతి యస్థి ప్రియములె యా – బ్రహ్మ రూపు
నామరూపములనువీడి – నపుడు మనమె
అద్వితీయమౌ బ్రహ్మము- నరయ గలము
…కోట శర్మ
వివరణ:
గొలుసు, గాజులు వంటి ఆభరణములు వేరు వేరు గా కనిపించినను అవి కేవలము నామ రూపములు గానే భిన్నములు. వాటికి ఉపాదానకారణమైన బంగారమే వాటి అసలు రూపము. బంగారముగా అవి అభిన్నములు. నామరూపములు త్యజించి చూడగా అవన్నీ ఒక్కటిగానే ( బంగారము గానే) గోచరిస్తాయి. బంగారము ఆ ఆభరణములు తయారు చేయకముందు, చేసిన తరువాత, అలాగే వాటిని కరిగించిన తరువాత కూడా ఉంటుంది. కాటట్టి బంగారము నిత్యము, సత్యము. కాని ఆభరణములు తయారుచేయటానికి ముందు లేవు. అలాగే వాటిని కరిగించాక ఉండవు కావున అనిత్యములు.
ఇదేవిధంగా బంగారు కంటే భిన్నంగా ( అంటే బంగారము మినహాయిస్తే) గాజులు, గొలుసు వంటి ఏ ఆభరణమూ ఉండదు. కనుక బంగారము సత్యము మరియు ఆధారము. ఆభరణములు అసత్యము మరియు ఆధేయము.
అలాగే జలము కంటె అలలు, నురుగు, బుడగలు ఎట్లు వేరు కావో, అట్లే విశ్వోపాదాన కారణమైన ఆత్మ కంటె ప్రపంచము వేరు కాదు. ఏవిధంగా తరంగ బుద్బుదాదులందు జలము అనుగతమై యున్నదో, అట్లే శుద్ధ చైతన్యము సంపూర్ణవిశ్వమునందనుగతమై యున్నది.
“అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశపంచకమ్ ।
ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం ।।” – దృక్ దృశ్య వివేకము.
అనగా అస్తి – ఉన్నది/ సత్ , భాతి – ప్రకాశించుచున్నది/ చిత్ / చైతన్యము, ప్రియం – ప్రియమైనది / ఆనందము, రూపము, నామము అను ఈ ఐదు అంశములు సమస్త ప్రపంచమునందు వ్యాప్తమై యున్నవి. వీటిలో”అస్తి-భాతి-ప్రియం” అను మొదటి మూడు అంశములు బ్రహ్మ (ఆత్మ) సంబంధమైనవిగా ప్రపంచమునందు స్థితి గలిగి యున్నవి. నామరూపములు రెండును జడ జగత్తుకు సంబంధించినవి. నామరూపములు ఎల్లప్పుడును ఒకేస్థితిలో నుండని కారణముచేత అవి వినాశములు. నామరూపముల రెంటిని త్రోసివేసినచో మిథ్యా జగత్తుకు సంబంధించినదేదీ మిగలక సచ్చిదానందరూపమైన బ్రహ్మానుభూతి కలుగుతుంది. ( Based on Ashtavakra Gita and Drik Drisya Vivekamu)
విషయ చింతన.. భగవద్గీత – 2- 62,63,64,65
సీసం
విషయ చింతన పెంచు విషయమం దాసక్తి
యాసక్తి వలననే యాశ గలుగు
నాయాస తీరనంతాగ్రహము గలుగు
వ్యామోహమును బెంచునాగ్రహమ్ము
అతి మోహమొందగా మతిమరుపు కలుగు
మతిదప్పగా బుద్ధి మందగించు
బుద్ధి నాశము తోడ బూర్తి నాశము గల్గు
పైరీతిగ మనిషి పతనమగును
ఆటవెలది
మనసు వశమున గల మనిషిరాగద్వేష
ములను వీడి యుండు ముదముతోడ
నట్టి శాంతచిత్తుడనయమా యాత్మలో
స్థిరముగా మెలగును చింత లేక
.. కోట శర్మ
భగవద్గీత – 2- 62,63,64,65 శ్లోకముల భావం:–
విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.
అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాపకశక్తి నశించును. బుద్ధి నాశనమువలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును.
అంతఃకరణమును వసమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనః శాంతిని పొందును.
మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియు నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్నివిషయములనుండి వైదొలగి, పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును
కం. తెరగులు రెండే జగతిన
ఎరిగినవి ఎరగనివి అవవేవీ బ్రహ్మన్
ఇరు తెరగులు అవి ఇవియని
ఎరుక పరచునదయినట్టి ఎరుకయె బ్రహ్మన్
….కోట శర్మ
భావము : ప్రపంచములో కొన్ని మనకు తెలిసినవి మిగిలినవన్ని తెలియనివి. కానీ బ్రహ్మము తెలిసినదీ కాదు అలాగే తెలియనిది కూడా కాదు. ఈ రెంటి గురించి తెలియజెప్పేదే ( అంటే ఇది తెలుసు అది తెలియదు అని ) జ్ఞానస్వరూపమైన బ్రహ్మము. అదే ఆత్మ స్వరూపము.
తే. మనసుమూలము నెరుగుచొ మాయమవును
మాయబలము నభాసగా మసలు జగతి
తనువు నేనను భావమే తగదనెడివి
రమణబోధలొసగును పరమపదమును
మత్త కోకిల
వేదమార్గము జ్ఞానమేనని వేయిసూక్తులు వ్రాసెడిన్
ఆదిలేనిది యంతులేనిది యంతటున్నది యొక్కటే
భేదభిన్నము లేనెలేదని భేరిగావిని పించెడిన్
ఆదిశంకర లోకమంగళ యార్షసద్గురవే నమో.. కోట శర్మ

Read More

ఓం శ్రీమాత్రే నమః

మత్త కోకిల – ర స జ జ భ ర
యతి మైత్రి – 11 వ అక్షరం
🙏ఓం శ్రీ సరస్వత్యైనమః🙏
జ్ఞానరూపిణి శ్వేతధారిణి నాభిజాతుని కంగనా
రాణి వందన మమ్మనాపద రాజమాలిక వేయగా
వాణి మోదము కోరి వ్రాసితి వాసిగా చిరు పద్యముల్
నేనుపూనిన పద్యవాహిని నేర్పుతోకొన సాగనీ.
…….కోట శర్మ…..
ఆటవెలదులు
1. దుర్గ యనిన సకల దుర్గతుల్ తొలగును
దుర్గ యనగ సకల దురిత హారి
దుర్గ యనగ సకల దుఃఖనివారిణి
కరుణ చూపు తల్లి కనక దుర్గ
2. కనకదుర్గ మల్లికార్జునులిద్దరు
అమ్మవారి తోడ నయ్య వారు
కొండ మీద మనకు నండగా నుండిరి
కరుణ చూపు తల్లి కనక దుర్గ
3. జయము జయము నీకు జగములకు జనని
జయము నిన్ను గొల్చు జనులకెపుడు
జయము ధర్మమునకు జననినీవుండగన్
కరుణ చూపు మమ్మ కనక దుర్గ
4. శరణు వేడు కొందు శ్రద్ధతో యమ్మను
చరణ పద్మములకు శిరము వాల్చి
హరణమౌను నిక్కమన్ని దురితములు
కరుణ చూపు తల్లి కనక దుర్గ
5. కోట్ల భక్త జనుల కోర్కెలు తీర్చంగ
నింద్ర కీల గిరిని యిల్లు చేసి
విజయ వాడ లోన వెలసెను దుర్గమ్మ
కరుణ చూపు తల్లి కనక దుర్గ
6. ఆది శక్తి దుర్గ యాద్యంత రహితము
నాది శక్తి! కొలిచి నంత నిన్ను
నాది లేని దుఃఖ మంతమౌ మెదలంట
కరుణ చూపు మమ్మ కనక దుర్గ
7. మాధవుండు ధర్మమాచరించగ నాడు
కనిన సంతసించి కనికరమున
కనక దుర్గ కనుక కనకవర్షమునిచ్చె
కరుణ చూపు తల్లి కనక దుర్గ
8. ఫల్గుణుడు తపమును భక్తితో సేయంగ
శంకరుండు మెచ్చి సంతసించి
పాశుపతమునొసగె పాండవునకిచట
కరుణ చూపు మల్లి కార్జునుండు

Read More

ముక్కంటిని వేడుకొంటి

కం.
హరహర! రుజహర! భవహర!
సురగణ వినుత! భుజగధర! శుభకర! పరమే
శ్వర! గిరివర! పరమ పురుష!
శరణు దురిత హర! హరినుత! శశిధర కనరా! .. కోట శర్మ
కం.
సాంబ! శుభంకర! శంకర!
అంబాపతి! అంబరీష! అంతకహంతా!
త్ర్యంబక! కల్మషకంఠ! ది
గంబర! శంభో! పురాంతకా!వందనముల్.. కోట శర్మ
కం.
త్రినయన! మునిజన వినుతా!
అనఘా! శమన దమన! మదనాంతక! పంచా
నన! నయనాయుధ! నను గన
మననము చేసెద ననయము మనమున నిన్నే!
పిలిచెదనీశ్వరా ..
చంపకమాల
పిలిచెద నీశ్వరా! వినుమ విజ్ఞత నాకును సంతరించగన్
నిలిచెద నీదు ధ్యానమున నిత్యము నిన్మదిలో స్మరించగన్
కొలిచెద నీదు రూపమును కోరికలన్నియు నంతరించగన్
తలచెద నీదు తత్వమును తత్వము నేనగుచున్ తరించగన్
…కోట శర్మ
మత్తకోకిల
శూలపాణిని చంద్రచూడుని సోమనాథుని భర్గునిన్
ఫాలనేత్రుని భూతనాథుని పార్వతీశుని శంభునిన్
కాలకంఠుని లింగమూర్తిని కాలకాలుని రుద్రునిన్
శైలవాసుని సన్నుతించెద సర్వదా స్మరియించుచున్ .. కోట శర్మ
మత్తేభవిక్రీడితము
శివునర్చించగ చిత్తశుద్ధి కలుగున్ సేవించు దాసుండవై
శివనామస్మరణమ్ము జేయుమెపుడున్ సిద్ధించునేకాగ్రతన్
శివమే నేనను వేదవాక్కు మదిలో చింతించుమెల్లప్పుడున్
భవబంధమ్ములు నిన్ను వీడునిక జీవన్ముక్తి సంప్రాప్తమై
..కోట శర్మ
వివరణ:
కర్మోపాసనలవలన కలిగే చిత్తశుద్ధి, ఏకాగ్రతలు ఆత్మవిచారణకు సాధనములు. ఈరెంటినీ సాధించిన సాధకుడు, శ్రుతి వాక్యములను శ్రవణ మననాదుల ద్వారా విచారించి, నేనే బ్రహ్మము నన్న స్ఫురణతో నిరంతరము నిధిధ్యాసన చేయగా బ్రహ్మానుభూతి సిద్ధించును.
శివము అనగా సర్వ మంగళమైన పరమాత్మ (మాండూక్యోపనిషత్ ).
ఉ.
మాపుమ మాపురమ్మున నుమాపతి! మాపును రూపుమాపుమా!
మాపరమాత్మవీవె వినుమా పరమేశ్వర! మాపురేపులున్
మాపురమందు గొల్చెదము మాపుమ చూపున నామరూపముల్
చూపును చూచునట్టి సరిచూపును చూడగ దారి చూపుమా!.. కోట శర్మ
మాపు = పోగొట్టు, మాలిన్యము
పురము = శరీరము ( స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు)
మాపురేపులు = రేయింబవళ్ళు
వివరణ:
పరమాత్మ తత్వమూర్తియైన ఉమాపతీ! మా చిత్తమాలిన్యమును నిర్మూలించుమా.
అహర్నిశలు మామదిలో నిన్ను స్మరించెదము. దృష్టిదోషమువలన కలిగిన ( ఆభాసా జనిత)
నామరూపములను లయము జేయుమా. సర్వసాక్షియైన (సమస్త దృశ్యములకు దృక్కయిన)
పరమాత్మానుభూతి కలిగించుమా.
🙏ముక్కంటిని వేడుకొంటి🙏
ఉత్పలమాల
కంటిని వేడికంటి నిలకంటికి రెప్పగ గావుమంటి, ము
క్కంటిని వేడుకొంటి నడుగంటగ గంటిని, నమ్మియుంటి చి
క్కంటిగ నింటిమింట తిగకంటియె గ్రంథిని మంటబెట్టగన్
కంటిని వెంటనంటి కఱకంఠుని నొంటిగ, నొండు లేదనిన్..కోట శర్మ
పద్యములో వాడబడిన శివుని నామములు: వేడికంటి, ముక్కంటి, తిగకంటి, కఱకంఠ.
అడుగంటు = క్షీణించు, నాశనమగు; గంటి = దుఃఖము ; చిక్కంటి = తలలో చిక్కుముడి తీసే నిడుపు దువ్వెన; ఇంటిమింట= ఇంటియొక్క మింటిలోనున్న, ఇల్లు అనగా దేహము, మింటి = ఆకాశము …. అనగా హృదయాకాశములోనున్న; గ్రంధి = చిక్కు ముడి అనగా అజ్ఞానము; మంటబెట్టు = తొలగించు; వెంటనంటి= వెంబడించి అనగా ఆశ్రయించి; ఒంటిగ = ఒక్కడేనని ( అద్వయమని) ; ఒండులేదనిన్ = ఇతరమేదీలేదని.
భావము: శివుని దర్శించి కంటికిరెప్పగ కాపాడమని కోరుకొంటిని. దుఃఖమును పోగొట్టమని వేడుకొంటిని. శివుడే తలలో చిక్కుముడిని తీసివేసే దువ్వెనలాగా నా హృదయగ్రంధులను ( చిక్కుముడి వంటి అజ్ఞానమును) తొలగిస్తాడని నమ్ముకున్నాను. శివునాశ్రయించి సర్వమూ శివమయని, ఉన్నదంతా ఆయనొక్కడేనని, వేరేమీలేదని తెలుసుకున్నాను.

Read More