బొజ్జ దేవుఁడు

దోదకము
సర్వజనావళి శాంతిని కోరెన్
పార్వతి బొమ్మకు ప్రాణము పోసె
న్నుర్విన విష్ణుడి యుద్భవమయ్యెన్
సర్వగణాలకు శాసకుఁడయ్యెన్
… కోట శర్మ
మత్త కోకిల
ఈశపుత్రుకు వక్రతుండుని కీశనమ్ముల దాతకున్
పాశహస్తుకు ఫాలచంద్రుకు ఫాలనేత్రుకుమారుకున్
క్లేశహారికి విఘ్నహంత్రుని కేకదంత గణేశుకున్
కేశవప్రియు కగ్రగణ్యుడి కెల్లవేళల మ్రొక్కెదన్
…కోట శర్మ
ఈశనము = ఐశ్వర్యము
తేగీ
ధవళ దేహి! ధవళ వస్త్రధారి! విష్ణు!
శాంత మూర్తి! చతుర్భుజి! శంభు సుతుడు
శ్రీవినాయకుడికి మ్రొక్క శిరము వాల్చి
విఘ్నములు తొలగునెపుడు విజయమగును
…కోట శర్మ
మత్త కోకిల
దంతతుండము లెంతయో పరతత్వ భావము తెల్పుచున్
వింతరూపము వీధివీధిన విగ్రహాలుగ నిల్చెగా
స్వంతలాభము కోరికొందరు సత్తుగా మరికొందరు
న్నంతటా వినిపించె దేవ గణాధిదేవుని కీర్తనల్
…కోట శర్మ
సత్తు = సత్ , Existence
సుగంధి
ఈశపుత్ర వక్రతుండ యేకదంతుడానమో!
క్లేశహారి విఘ్నరాజ కేశవప్రియా నమో!
పాశబంధ నాశకారి పాపనాశకానమో!
పాశహస్త ఫాలచంద్ర పాహిమామ్ వినాయకా!
…కోట శర్మ
సీ
శుద్ధాంబరమువోలె శుధ్ధాత్ముఁడీతండు
శ్వేతవర్ణము దెల్పు చేతనమ్ము
నంతరిక్షమువోలె నంతట వ్యాపించు
వేదాంత సత్యమే విష్ణువితఁడు
మూడు గణమ్ములే మూడుగుణమ్ములు
గుణగణాధిపతి నిర్గుణుఁడితండు
నంతరాయమ్ములనంతమ్ము జేసెడి
యాద్యపూజిత సర్వ వేద్యుడితఁడుతేగీ
బొజ్జ దేవుఁడు దేవతా పూజ్యుడితఁడు
నరసురాసుర సేవ్యుఁడనంతుడితఁడు
నేక దంతుఁడితఁడు గుణాధీశుఁడితఁడు
సిద్ది బుద్ధిప్రదాత సచ్చిత్తుఁడితఁడు
…కోట శర్మ

Read More